హిమాచల్ సంక్షోభం..
కాంగ్రెస్ ప్రభుత్వాల పునాదులు కదులుతున్నాయి. కదులుతున్నాయనడం కన్నా.. పార్టీలో ఉన్న విభేదాలు, హైకమాండ్ నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ నిర్వహణ సమస్యాత్మకంగామారుతోంది. దీనికి తోడు అదనుకోసం వేచి చూస్తున్న కేంద్రం.. వారితో సంప్రదింపులు జరుపుతూ టచ్‌లోకి వెళ్తోంది. సమయం కలిసివస్తే సర్కార్‌ను కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇప్పుడు హిమాచల్ సర్కార్‌పైనా మోడీ -షా ద్వయం కన్నేసిందని చెప్పొచ్చు.
రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆ వెంటనే మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేయడం, వెనక్కి తీసుకోవడం చక చకా జరిగిపోయాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. అల్పహార విందుకు సభ్యులు అందరూ రావాలని సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేలు చేజారకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రి విక్రమాదిత్య ధిక్కార స్వరం వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది.
హిమాచల్ ప్రదేశ్ సీఎం నిర్వహించిన సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడంతో ప్రభుత్వం కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. సభలో తగినంత మెజార్టీని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన హిమాచల్ సర్కార్…ఆరుగురు సభ్యులపై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఫలితంగా వారిపై అనర్హత వేటు వేశారు స్పీకర్. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 68 నుంచి 62కి తగ్గినట్లైంది. మెజార్టీ మార్క్ 32కి చేరింది.
ఇప్పుడు కాంగ్రెస్ వెంట 32 మంది సభ్యులు ఉండటంతో తమ ప్రభుత్వానికి ఢోకా లేదని కాంగ్రెస్ నేతలు లెక్కగడుతున్నారు రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతోందని సీఎం సుఖు ధీమాతో ఉన్నారు. తనను రాజీనామా చేయలేదని హైకమాండ్ కోరలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని అంటున్నారు.













