గుజరాత్ లో ఆప్‌కు బిగ్ షాక్..! బీజేపీ గూటికి ఐదుగురు ఎమ్మెల్యేలు..!?
బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ B టీమ్ అనే ప్రచారం మొదటి నుంచి సాగుతున్నదే. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆప్ పోటీ చేస్తుందనే విమర్శ ఎంతోకాలంగా ఉంది. ఇప్పుడు గుజరాత్ లో కూడా తమ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బీజేపీ వ్యతిరేక ఓటు తమకు రాకపోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల బీజేపీ బాగా లబ్ది పొందిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. బీజేపీ గెలుపుకు ఆప్ ఎంతో దోహదపడిందని వారు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇప్పుడు గుజరాత్ లో ఆప్ కు గట్టి షాక్ తగులబోతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 13 శాతం ఓట్లు సాధించి 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఓటమే లక్ష్యమని మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ .. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ, పంజాబ్ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇది ఓట్లు రాబట్టుకోవడానికి ఆప్ కు ఎందో దోహదపడింది. అయితే సీట్లు మాత్రం ఆశించినన్ని రాలేదు. కేవలం ఐదు సీట్లతోనే ఆప్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆప్ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మొన్నటివరకూ బీజేపీ ఎమ్మెల్యేలే. వారికి బీజేపీ సీట్లు ఇవ్వకపోవడంతో ఆప్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు బీజీపీ ఘనవిజయం సాధించి ఏడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆప్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
ఆప్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఒకే మాటగా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. ప్రతిపక్షం బలహీనంగా ఉందని.. అందుకే తాము అధికార పార్టీలో ఉంటే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్తున్నారు. విపక్షంలో ఉంటే తమను నమ్ముకున్న ప్రజలకు ఏమీ చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రజల దగ్గరకు వెళ్లి.. ఆప్ లో ఉండాలా.. బీజేపీలో చేరాలా.. అని అడుగుతామని.. వాళ్లు చెప్పినట్లు నడుచుకుంటామని చెప్తున్నారు. అయితే ఆప్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ప్రజాభిప్రాయం.. లాంటివన్నీ కాకమ్మ కబుర్లే అని.. వాళ్లు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని భావిస్తున్నారు.
గుజరాత్ లో బీజేపీ అధికారం చేపట్టక ముందే ఆప్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కమలం గూటికి వెళ్తుండడం కేజ్రివాల్ కు పెద్ద షాక్ లాంటిదే. ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య పెద్ద వార్ నడుస్తోంది. అయితే అక్కడ కేజ్రివాల్ బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. కానీ గుజరాత్ లో మాత్రం బీజేపీదే హవా. పైగా బీజేపీ గెలుపుకోసం కేజ్రివాల్ తీవ్రంగా కృషి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలంతా బీజేపీ గూటికి చేరుతుండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరి దీనిపై ఆప్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.













