Sydney: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. ఐఎస్ పనేనా..?
ఇజ్రాయెల్ లో ఓ ఉత్సవానికి హాజరైన వారిని హమాస్ ఉగ్రదళాలు ఎలా పొట్టన పెట్టుకున్నాయో.. అలాగే పహల్గామ్ లో పర్యాటకులను నలుగురు పాక్ ఉగ్రవాదులు ఎలా దారుణంగా హత్య చేశారో.. అదే స్థాయిలో ఆస్ట్రేలియా సిడ్నీలోనూ ఆస్ట్రేలియా యూదులపై ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు. ఆయుధాలతో బోడీ బీచ్ ఉత్సవానికి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు.. నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందారు.38 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. మరొకడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్ర దాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బోండీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించారు.
యూదుల పండగ హనూకా ప్రారంభానికి సూచికగా ఆదివారం బోండీ బీచ్లో ‘చానుకా బై ద సీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వందల మంది యూదులు హాజరయ్యారు. వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బోండీ పెవిలియన్ పక్కన ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారు. దీంతో వందల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
మృతుల్లో బోండీలోని మత గురువు ఎలి ష్లాంగర్ ఉన్నారు. ఆయనే ఈ ఉత్సవాన్ని నిర్వహించిన వారిలో కీలక వ్యక్తి. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి కారుపై రెండు ఐఎస్ కు సంబంధించిన జెండాలున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ దాడి వెనక ఐఎస్ హస్తముందా అన్నకోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
సిడ్నీలో ఉగ్రదాడిని ప్రధాని మోడీ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్, ప్రపంచదేశాల నేతలు ఖండించారు. భారత ప్రజల తరఫున మరణించిన వారికి సంతాపం తెలుపుతున్నానని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రజలకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని మృతులకు సంతాపం తెలిపారు.
చాబాద్ అనే సంస్థ మత విశ్వాసాలను నమ్మని వారిని మతంలోకి తీసుకొచ్చేందుకు పని చేసే సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా కేంద్రాలను నడుపుతోంది. యూదుల సెలవుల్లో భారీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.






