తానా సేవ, కార్యక్రమాలు నిరంతరం అన్నీచోట్లా జరగాలన్నదే లక్ష్యం
– తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి
ఉత్తర అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా నాలుగు దశాబ్దాలకుపైగా అమెరికా తెలుగు కమ్యూనిటీకి, ఇటు మాతృరాష్ట్రంలోని ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎల్లప్పుడు కార్యక్రమాలు, సేవలు చేస్తూనే ఉండాలన్నదే తన లక్ష్యమని తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి అన్నారు. జూలైలో తానా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తన లక్ష్యాలను వివరిస్తూ తానా కార్యక్రమాలు, సేవలు ఎప్పుడో ఒకటో రెండో కాక నిరంతరం అన్నీచోట్లా జరగాలన్నారు. అందుకు అనుగుణంగానే ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఆధ్వర్యంలోని తానా కార్యవర్గం దాదాపు 50కిపైగా కార్యక్రమాలను ఇప్పటివరకు నిర్వహించింది. జన్మభూమి సేవల్లో భాగంగా తానా తరపున పోచంపల్లి చేనేత కార్మికులకోసం మొదటివిడతగా దాదాపు 1,000 ఆసు యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టారు. తెలుగు టైమ్స్ న్యూస్‌ఎడిటర్ గోవిందరాజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన వెల్లడించారు.
మీరు బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను వివరిస్తారా?
జూలైలో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలను అమెరికా నలుమూలలా తానా తరపున చేయడం జరిగింది. బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం కింద అమెరికాలోని పేద విద్యార్థులకు స్కూల్బ్యాగ్లను, కిట్ల పంపిణీ, కూడు,గూడలేని నిరుపేదలకోసం ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలు, కొత్త కార్యవర్గం తరపున వివిధ నగరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్థానిక కళాకారుల టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడంతోపాటు కమ్యూనిటితో మమేకమయ్యాము. ఫిలడెల్ఫియాలో, న్యూయార్క్‌లో తానా టీటీడి సహకారంతో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం అందరికీ నచ్చింది. సహస్రావధాని మేడసానిమోహన్గారితో వివిధ నగరాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు తెలుగు భాషాభిమానుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. కమ్యూనిటీ సభ్యుల ఆరోగ్యభద్రతకోసం మెడిటేషన్, సిపిఆర్ ట్రైనింగ్ వంటివి ఏర్పాటు చేశాము. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంకోసం న్యూజెర్సి, ఛార్లెట్, ఒహాయో వంటి చోట్ల ఆటల పోటీలను నిర్వహించాము. తానా ఫౌండేషన్ తరపున వైద్యసేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. భారత్ బయోటెక్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో హెపటైటిస్ బి, టైఫాయిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నాము. ఇతర సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా తానా పాల్గొంటోంది. దీనిద్వారా అన్నీవర్గాలవారితోనూ, కమ్యూనిటీతోనూ తానా సేవలను పరిచయం చేస్తున్నాము. దక్షిణాఫ్రికాలో తెలంగాణ అసోసియేషన్ (టాసా) నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కూడా పాల్గొని తానా అందిస్తున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించాము. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంతోపాటు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము. తానా టీమ్‌స్క్వేర్ ద్వారా ఆపదలో ఉన్నవారిని, అనుకోని ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపే కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేస్తున్నాము.
తానాలో మీ ప్రవేశం గురించి చెప్పండి?
తానా చేస్తున్న సేవలు, కార్యక్రమాల గురించి పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకుని తానాలో చేరాలని నిర్ణయించుకున్నాను. అమెరికా వచ్చిన తరువాత తానాలో చేరడంతోపాటు చేసిన సేవా కార్యక్రమాలు అధ్యక్షుడిని అయ్యేలా చేసింది. తానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు తానా ఫౌండేషన్ అధ్యక్షునిగా పనిచేశాను. అప్పుడు చేసిన సేవా కార్యకమాలు ఎంతోమందిని ఆకర్షించాయి. తానా అధ్యక్షునిగా కూడా పలు సేవా కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి సేవలను అందించనున్నారు?
తానా మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తూ కార్యక్రమాలను చేపడుతున్నాము. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనిద్వారా యువతకు అవసరమైన శిక్షణ అందించనున్నాము. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా అవసరమైన పుస్తకాలతోపాటు విజ్ఞానపరమైన పుస్తకాలతో ఓ లైబ్రరీని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తాము. దీనికోసం ప్రణాళికను కూడా తయారుచేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవసరమైన పాఠశాలల్లో గదుల పునర్మిర్మాణం, లైబ్రరీ గదుల నిర్మాణాలు చేపట్టాం. డిజిటల్ తరగతుల ఏర్పాటులో కూడా తానా పాలుపంచుకుంటోంది. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంలో కూడా తానా తనవంతు సాయం చేస్తోంది.
వైద్యసేవల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో మొదటి విడతగా రూ.7 కోట్ల వ్యయంతో హైపటైటిస్-బి, టైపాయిడ్ నిరోధక టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భారత్ బయోటెక్‌తో కలిసి వ్యాక్సిన్‌ను అన్ని గ్రామాల్లో ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాం. శంకర ఐ ఫౌండేషన్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రుల సహకారంతో వివిధ చోట్ల వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాము.
రాష్ట్రంలోని చేనేత కళాకారులను ఆదుకునేందుకు వీలుగా ఆసుయంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేస్తున్నాము. ముందుగా పోచంపల్లి చేనేత కార్మికులకు తొలి విడతగా 1000 యంత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టాము. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ఖమ్మం నగరంలో పవర్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నాం.
తెలుగు భాషకు తానా చేస్తున్న కార్యక్రమాలేమిటి?
మన భాషను ప్రోత్సహించడం, ముందుతరాలవారికి తెలుగు భాషను నేర్పించడం తానా లక్ష్యాల్లో ఒకటి అందులో భాగంగానే తెలుగు భాషను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను తానా చేస్తోంది. అమెరికాలో 7 సంవత్సరాలుగా చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’కు తానా గతంలోనే మద్దతు పలికింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత పాఠశాల ద్వారా మరిన్ని నగరాల్లో ఉంటున్న తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకు వీలుగా అవసరమైన కార్యాచరణను కమిటీ సభ్యులతో కలిసి చర్చించడం జరిగింది. వచ్చే సంవత్సరం పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని మేము అమలు చేయనున్నాము.
తెలుగు భాషకు సేవ చేస్తున్నవారిని ప్రోత్సహించే విధంగా తానా గిడుగు రామ్మూర్తి తెలుగుభాషా పురస్కారంతో సత్కరిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవలనే విజయవాడలో జరిగిన ఓ?కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉమామహేశ్వర్‌కు ఇచ్చాము.
ఇమ్మిగ్రేషన్ విధానంపై మీ కామెంట్ ఏమిటి?
ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల మనవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటారు. ప్రతిభ ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కడా ఉండవు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వచ్చే విద్యార్థులు గుర్తింపు కలిగిన యూనివర్సిటీలనే ఎంపిక చేసుకోవాలి. ఉద్యోగులు సంస్థల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు ఉండవు.
అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సమయం సమీపిస్తున్నందువల్ల ఇమ్మిగ్రేషన్ విధానాలు కఠినంగానే కనిపిస్తుంటాయి. అదేసమయంలో మనవాళ్ళకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవడానికి అవసరమైన సహాయాన్ని, కార్యాచరణను తానా చేస్తోంది. అదే సమయంలో అమెరికా వచ్చేవాళ్ళకోసం అవసరమైన గైడ్‌లైన్స్‌ను తానా తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇబ్బందుల్లో చిక్కుకున్నవారికి ఇమ్మిగ్రేషన్ అటార్నీల ద్వారా సహాయం చేస్తోంది.
యువతను ఎలా ఆకట్టుకోవాలనుకుంటున్నారు?
తానాకు యువతే ప్రస్తుతం బలం. అమెరికాలో పుట్టి పెరిగిన యువతను తానా కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా కృషి చేస్తున్నాము. వారిని పెద్ద సంఖ్యలో తానాలో చేర్చుకుని తానాను మరింత బలమైన సంస్థగా తయారు చేయనున్నాము.
మీ భవిష్యత్తు లక్ష్యాలేమిటి?
అమెరికాలోని చిన్నారులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలపై అవగాహన పెంపొందించేందుకు వీలుగా భద్రాచలం, కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బాలోత్సవం తరహాలో అమెరికాలో కూడా తానా బాలోత్సవం నిర్వహించాలని అనుకుంటున్నాము. తానాలో మరింత ఎక్కువమందిని సభ్యులుగా చేర్పించేందుకు వీలుగా ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాము. మహిళలకోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరింతగా విస్తృతపరుస్తాము. అనాధ పిల్లలకు విద్యాసౌకర్యం కల్పించడం, పేదలకు ఉచిత వైద్యశిబిరాలను మరింత విస్తృతంగా చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాము.













