రాములమ్మకు ఎసరు పెట్టే పనిలో!
లేడీ సూపర్ స్టార్ అనగానే ఇప్పటికీ గుర్తొచ్చే హీరోయిన్ విజయశాంతి. కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడం వల్ల ఆమెను ఆ పేరు వరించింది. ఒకదశలో అనుష్క ఆ టైటిల్‌కి అర్హురాలు అని భావించారు. అయితే అరుంధతి మినహా రుద్రమదేవి, సైజ్ జీరో వంటి ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందువల్ల వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్న నయనతారకు లేడి సూపర్ స్టార్ బిరుదు ప్రదానం చేసేందుకు ఆమె ఫ్యాన్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. నయనతార తమిళంలో నటించిన ఆరమ్ అనే చిత్రం అక్కడ అఖండ విజయం సాధిస్తోంది. ఈ చిత్రాన్ని కర్తవ్యం పేరుతొ తెలుగులో అనువదిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం జై సింహా చిత్రం చేస్తున్న నయన తమిళంలో ఏకంగా అయిదారు సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉంది. ముఖ్యంగా వాటిలో మూడు చిత్రాలు మహిళా ప్రధాన చిత్రాలు కావడం గమనార్హం.













