న్యూయార్క్ సిటీలోనే వెయ్యి మరణాలు
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్ సిటీలోనే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వెయ్యికి పైగా మరణించారు. సిటీలో ఇప్పటి వరకు 41,771 కేసులు నమోదు కాగా.. మరణించిన వారి సంఖ్య 1,096కు చేరింది. ప్రస్తుతం 8,400 మంది ఆస్పత్రిల్లో చికిత్స పొందుతుండగా అందులో 1,888 మంది ఐసీయూలో ఉన్నారు. న్యూయార్క్ స్టేట్లో మొత్తం 75 వేల మందికి కరోనా సోకగా.. 1,550 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో ఏకంగా 332 మంది చనిపోయారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఆసుపత్రుల్లో అసలు పరీక్షలే నిర్వహించడం లేదని బాధితులు వాపోతున్నారు. న్యూయార్క్ తర్వాత అత్యధిక కేసులు న్యూజెర్సీలోనే నమోదయ్యాయి.













