ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదు
ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానల్లో న్యూస్ ప్రజెంటర్గా పనిచేస్తున్న రాధికారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పలువురు టీవీ, సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడికి గురై ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో అపార్ట్మెంట్పై నుంచి దూకి బలవర్మణానికి పాల్పడింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా రాధికారెడ్డి మృతిపై స్పందించింది. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన, బాధలు తొలగిపోవని, మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని ఆమె ట్వీట్ చేసింది. రాధికారెడ్డిని తానెప్పుడూ కలవలేదని, కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని రష్మీ పోస్ట్ చేసింది. మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో ఆత్మహత్యలకు అతిపెద్ద కారణంగా మారుతోందని రష్మీ చెప్పింది. ఒత్తిడికి లోనైతే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, అంతేకానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె సూచించింది. నిద్ర లేవగానే ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదని అన్నారు.













