మళ్లీ నమస్తే ట్రంప్ ఎప్పుడు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం నరేంద్ర మోదీ మరో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించారు. కొవిడ్ 19కి సంబంధించి భారత్ గణాంకాల విశ్వసనీయతపై అమెరికా అధ్యక్షుడు సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో చిదంబరం వ్యంగ్యంగా స్పందించారు. భారత్, రష్యా, చైనా వంటి దేశాలు కరోనా వైరస్ మరణాల సంఖ్యలను బయట పెట్టవని మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి చర్చలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మిస్టిర్ డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను చైనా, రష్యా వంటి దేశాలతో కలిపారు. ఈ మూడు దేశాలు కొవిడ్ మరణాల సంఖ్యను దాచిపెడతాయని ఆరోపించారు. అంతేకాకుండా ఆయా దేశాలే అత్యధిక వాయు కాలుష్యాన్ని కారణమని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో తమ ప్రియ నేస్తమైన ట్రంప్ గౌరవార్ధం మోదీ మరో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారు? అని చిదంబరం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించారు.













