వారితో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదు… నితిశ్ కుమార్
బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో అహంకారంతో కళ్లు మూసుకుపోయిన నాయకులు పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. వారు దేశాభివృద్ధి కోసం కాకుండా సమాజంలో చీలికలు సృష్టించేందుకు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకోవడం గానీ, కలిసి పనిచేయడం గానీ జరగదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సోషలిస్టు భావజాలం కలిగిన వారితో కలిసి ముందుకు వెళ్తానని వెల్లడిరచారు. బీజేపీ అగ్రనాయకులైన అటల్ బిహార్ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వాని, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులను ఆయన గుర్తు చేసుకున్నారు. వారంతా దేశం కోసం పనిచేశారన్నారు. ఇప్పుడు పార్టీ మొత్తం అహకారులతో నిండిపోయిందని తెలిపారు. వాజ్పేయి మంత్రివర్గంలో తాను మూడు శాఖలకు బాధ్యతలు నిర్వర్తించానన్నారు.













