పది కిలోమీటర్ల లోతు పాతిపెడతా… మాఫియాకు శివరాజ్ సింగ్ చౌహాన్ వార్నింగ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాఫియాపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మాఫియాని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారు వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని లేదంటే 10 అడుగుల మేర పాతిపెడతానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘‘ఈ మధ్య నేను చాలా కోపంతో ఉన్నాను. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోండి. లేదంటే 10 అడుగుల మేర పాతిపెడతా. ఇక మీ ఆచూకీ కనుక్కోవడం కూడా సాధ్యం కాదు. జాగ్రత్త.’’ అంటూ సీఎం శివరాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టాలను గౌరవించే వారితో తమ ప్రభుత్వం అత్యంత మర్యాదగా ప్రవర్తిస్తుందని, రాక్షసుల పట్ల మాత్రం కనివినీ ఎరుగని రీతిలో కఠినంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్, భూదందాలు, గూండాలు… ఇలాంటి వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని శివరాజ్ ప్రకటించారు.













