బాబా రాందేవ్ కు డబ్ల్యూహెచ్‌వో షాక్..
కరోనా వైరస్ చికిత్స కోసం తాము ఏ సాంప్రదాయ ఔషధానికి ఆమోదం తెలపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సృష్టం చేసింది. ఈ మధ్యే తాము తీసుకొచ్చిన కరోనిల్ మందుకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపిందన్న పతంజలి ప్రకటన నేపథ్యంలో ఆ సంస్థ వివరణ ఇవ్వడం గమనార్హం. కొవిడ్ 19 చికిత్స కోసం ఏ సాంప్రదాయ ఔషధ సామర్థ్యం పై తాము సమీక్ష నిర్వహించడం కానీ, సర్టిఫై చేయడం కానీ చేయలేదని డబ్ల్యూహెచ్‌వో ట్వీట్ చేసింది. అయితే అందులో పతంజలి పేరుగానీ, కరోనిల్ పేరుగానీ ప్రస్తావించలేదు.
కరోనిల్‌కు భారత ప్రభుత్వంతో పాటు డబ్ల్యూహెచ్‌వో కూడా ఆమోదం తెలిపిందని బాబా రాందేవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు డబ్ల్యూహెచ్‌వో ఈ వివరణ ఇచ్చింది. అంతేకాదు కరోనాకు తొలి సాక్ష్యాధారిత మందు తమదేనని కూడా ఆయన చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలపడం వల్ల తాము 150 దేశాల్లో కరోనిల్‌ను విక్రయించే అవకాశం ఉన్నదని రాందేవ్ బాబా చెప్పడం విశేషం.













