కోవిడ్ సెస్ వేయనున్న కేంద్రం
కరోనా కారణంగా వివిధ దేశాలతోపాటు భారతదేశం కూడా బాగానే నష్టపోయింది. ఈ దశలో వ్యాక్సిన్ కూడా ఉచితంగా అందించడం భారమే అయినప్పటికీ దేశ ప్రజల దృష్ట్యా ఉచితంగా ఇవ్వడానికే ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. కాగా దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ మరింత భారం కానున్నందున ఈ వ్యాక్సినేషన్ భారాన్ని సంపన్నులమీద కంపెనీల మీద వేయాలని ఆర్థికశాఖ యోచిస్తున్నదట. ఇందుకోసం వ్యాక్సిన్ సెస్ వేయాలని ప్రణాళికలు రచిస్తున్నదట. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌కు ముందే సంపన్నులపై వ్యాక్సిన్ సెస్ వేయాలని కేంద్రం యోచిస్తోంది.
కరోనా వ్యాక్సినేషన్ కోసం (లాజిస్టిక్ ఖర్చులు సహా) రూ.60000-65000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్రం యోచిస్తున్నది. అయితే ఈ మొత్తాన్ని సంపన్నుల మీద మోపాలని కేంద్రం యోచిస్తున్నదట. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే పలు కంపెనీలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. కరోనా వల్ల ఇప్పటికే బిజినెస్ నడవక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా సెస్ వేయడం సరికాదని వాళ్లు అంటున్నారట. అయితే కేంద్రం ముందు ప్రస్తుతం మరో మార్గం లేదు. వ్యాక్సినేషన్ కొనసాగించాలంటే పన్ను విధించాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేస్తోంది.













