బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన.. వారిని భారత్కు అప్పగిస్తాం
భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో రోజు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను అతి తొందరగా భారత్కు అప్పగించేందుకు తాము సిద్ధంగా వున్నామని ప్రకటించారు. వారిని కచ్చితంగా భారత్కు పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇలా అప్పగించేందుకు కొన్ని చట్టాలున్నాయని గుర్తు చేశారు. చట్టాలను ఎగవేసి, మా దేశానికి వచ్చే వారిని ఎంత మాత్రమూ ఉపేక్షించమని, అలాంటి వారిని స్వాగతించమని కూడా స్పష్టం చేశారు. భారత చట్టాల నుంచి తప్పించుకొని, తమ దేశ చట్టాలను వాడుకోవాలని చూస్తే వారిపై తాము కఠినంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.













