ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్… టీఎంసీపై
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ ఉద్ధవ్ ఠాక్రేను చిక్కులు వీడటం లేదు. కీలకమైన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ముందు శివసేనకు (ఉద్దవ్ వర్గం)మరో షాక్ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్లో శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. ఇప్పటికే 66 మంది రెబెల్ కార్పొరేటర్లు మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండేను ఆయన నివాసంలో కలిసినట్లు తెలుస్తోంది. అయితే 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్దవ్ ఠాక్రే టీఎంసీపై అధికారాన్ని కోల్పోయారు. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ముఖ్యమైన పౌర సంస్థ. ఇప్పటికే అధికారం కోల్పోయి తలపట్టుకుంటున్న ఉద్దవ్‌కు మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.













