నవాజ్ షరీఫ్ ను కలుసుకున్నానా? మోదీని కలవడంలో తప్పేముంది? సీఎం ఉద్ధవ్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉద్ధవ్. ‘‘రాజకీయంగా మేము కలిసి లేకపోవచ్చు. అంత మాత్రాన మా సంబంధాలు చెడిపోయినట్లు కాదు కదా… నేను నవాజ్ షరీఫ్‌ను కలుసుకుంటున్నానా? మన ప్రధానిని వ్యక్తిగతంగా కలుసుకుంటే అందులో తప్పేముంది? అని థాకరే ప్రశ్నించి, ఆసక్తి లేపారు.
మరోవైపు ప్రధాని మోదీతో మరాఠా రిజర్వేషన్ కోటా అంశాన్ని ప్రస్తావించారు. దీనితో పాటు తుపాను సాయం, వ్యాక్సిన్ అంశాలపై సీఎం ఉద్ధవ్ చర్చించారు. 2018 లో ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరాఠాలను బీసీలుగా గుర్తించింది. 16 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీంతో రిజర్వేషన్లు 52 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. దీంతో కొందరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విద్యారంగంలో 13 శాతానికి, ఉద్యోగాల్లో 12 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీం మొత్తం రిజర్వేషన్లనే కొట్టిపారేసింది. ఈ విషయాన్ని సీఎం ఉద్ధవ్ మోదీతో ప్రస్తావించారు. సీఎం ఉద్ధవ్ వెంట డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే అధికారిక చర్చలు జరిగిన తర్వాత, సీఎం ఉద్ధవ్, ప్రధాని మోదీ ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తోంది.