శరద్ పవార్ వర్సెస్ తోమర్
నూతన సాగు చట్టాలపై కేంద్రం, విపక్షాల మధ్య రోజురోజుకీ మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు, కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. నూతన చట్టాలతో కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే వీటి అంకురార్పణకు బీజాలు వేశారని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను పెంచి, ఇతర సంస్కరణపై దృష్టి సారిస్తే బాగుటుందని చురకలంటించారు. తాను వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ మండీలను పరిపుష్టం చేసినట్లు గుర్తు చేశారు.
పవార్ ట్వీట్లన్నీ తప్పులే : తోమర్ ఫైర్
పవార్ చేసిన ట్వీట్లపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవసాయ చట్టాలనే పవార్ మంత్రిగా ఉన్న సమయంలో అమలు చేయడానికి తీవ్రంగా కృషి చేశారని చురకలంటించారు. శరద్ పవార్ ఓ సీనియర్ రాజకీయ నాయకులని, గతంలో వ్యవసాయ మంత్రిగా కూడా పనిచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా వ్యవసాయం రంగంలో పూర్తి అవగాహన ఉన్నారని, ఆయనే తప్పుడు సమాచారం ఇస్తే ఎలా? అని తోమర్ సూటిగా ప్రశ్నించారు. పవార్ చేసిన ట్వీట్లో విషయం లోపంతో పాటు తప్పుడు సమాచారం కూడా ఉందని దుయ్యబట్టారు. ఇలా చేయడం చాలా బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘పవార్ ఓ సీనియర్ నేత. గతంలో వ్యవసాయ మంత్రిగా కూడా సేవలందించారు. వ్యవసాయ రంగంపై విశేష, లోతైన అవగాహన ఉన్న నాయకులు. గతంలోనూ ఈ చట్టాలను అమలు చేయాలని చూసిన వ్యక్తి. ఆయన ట్వీట్లన్నీ తప్పుడు సమాచారంతోనే ఉన్నాయి.’’ అని తోమర్ మండిపడ్డారు. నూతన చట్టాలతో మండీలకు ఎలాంటి ఇబ్బందీ లేదని, పైగా మరింత పరిపుష్టం అవుతాయని తోమర్ స్పష్టం చేశారు.













