Indigo Airlines: ఇండిగోపై కేంద్రం సీరియస్.. ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించేది లేదు!
ఇండిగో విమానయాన సంస్థలో (Indigo Airlines) నెలకొన్న సంక్షోభం, ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సంస్థ ఎంత పెద్దదైనా సరే, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ అంశంపై వివరణ ఇచ్చిన ఆయన.. ఇండిగోకు డీజీసీఏ (DGCA) ద్వారా షోకాజ్ నోటీసు జారీ చేశామని, దర్యాప్తులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పైలట్ల (Indigo Airlines) పనివేళలు, వారిపై ఒత్తిడి తగ్గించేందుకు శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. భారత్ మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ఈ (Indigo Airlines) సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్డీయే ఎంపీల సమావేశంలో స్పందించారు. నిబంధనలు, చట్టాలు ప్రజల సౌలభ్యం కోసమే ఉండాలని, అవి అమాయక పౌరులను ఇబ్బంది పెట్టేలా మారకూడదని ఆయన హితవు పలికారు. వ్యవస్థను సరిదిద్దే పేరుతో ప్రజలను వేధించడం సరైన పద్ధతి కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.






