సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పదేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సామూహిక అత్యాచార, హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు ఢిల్లీ హైకోర్టులో మరణశిక్ష పడగా, వారిని సర్వోన్నత న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. 2012లో ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఓ 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన రవి కుమార్, రాహుల్, వినోద్ అనే యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. అత్యాచారం అనంతరం ఆమెకు అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. హతురాలి మృతదేహాన్ని హరియాణాలోని ఓ పొలంలో గుర్తించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో తొలుత విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా నిర్దారించి మరణ శిక్ష విధించింది.













