సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన రాహుల్ గాంధీ
బిల్కిస్ బానో లైంగిక దాడి కేసులో 11 మంది దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం లేదని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును విపక్ష పార్టీలు స్వాగతించాయి. ఇది న్యాయం సాధించిన విజయమని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. నేరస్తులను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను రాహుల్ ఎండగట్టారు. అహంకారపూరిత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్కిస్ బానో చేసిన సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా న్యాయం గెలిచిందనేందుకు ఈ తీర్పు సంకేతమని అన్నారు.













