ముకేశ్ అంబానీ భద్రతపై… సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ పారిశ్రామికవేత్త, కుబేరుడు ముకేశ్ అంబానీ భద్రత విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించేందుకు కేంద్రానికి అనుమతిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ముకేశ్ అంబానీ కుటుంబానికి భద్రత సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జూన్ 29న సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. అంబానీ భద్రతను సవాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ చేపట్టిన త్రిపుర హైకోర్టు రెండుసార్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంబానీతోపాటు ఆయన సతీమణి పిల్లలకు పొంచి ఉన్న ముప్పు అంచనా నివేదికపై కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న పత్రాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా ఆ ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు భద్రత కొనసాగింపుపై స్పష్టతనిచ్చింది.













