అశేష భారతావని పులకించేలా అయోధ్య రామ మందిరం నిర్మాణం
జగదభిరాముడు, ఇనకులసోముడు, ఆ సీతారాముడి రాజధాని అయోధ్యా నగరం ఉత్సవశోభ సంతరించుకుంది. కోట్లాది రామభక్తుల ఆకాంక్ష , దశాబ్దాల స్వప్నం సాక్షాత్కరమయ్యే తరుణం ఆసన్నమైంది. అయోధ్యలో శ్రీ సీతారామస్వామికి భవ్య,దివ్య, సుందర రామాలయ నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో మద్యాహ్నం 12,20 నిమిషాలకు బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ట చేయనున్నారు. ఈ అపూర్వ ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. సుమారు 4 వేల మంది సాధువులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయోధ్య రామాలయంలో వారం రోజుల ముందు నుంచే ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 15 వ తేదీన ప్రారంభం కానున్న ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు 22 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 22 వ తేదీన అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం..
జనవరి 22 వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన కార్యక్రమం అయిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి పూజ జరుగుతుంది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకనుల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య 84సెకన్ల పాటు రాముడి విగ్రహాన్ని.. గర్భగుడిలో కేటాయించిన స్థలంలో ప్రతిష్టించనున్నారు. ఇక జనవరి 24 వ తేదీ నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతివ్వనున్నారు.
జనవరి 15 వ తేదీ నుంచే అయోధ్యలో యఙ్ఞ క్రతువులు ప్రారంభం కానున్నాయి. జనవరి 15 వ తేదీన మకర సంక్రాంతితో అశుభ కాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురానున్నారు. జనవరి 16 వ తేదీన శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్షను స్వీకరించనున్నారు. ఇక జనవరి 17 వ తేదీన శ్రీరాముని విగ్రహాన్ని నగర ఊరేగింపు చేయనున్నారు. ఆ రోజే అయోధ్య రామ మందిరంలో కొలువు దీరనున్న రాముడి విగ్రహం ప్రపంచానికి తెలియనుంది. మరోవైపు.. జనవరి 18 వ తేదీన మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక జనవరి 19 వ తేదీన అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్ని గుండాన్ని స్థాపించనున్నారు. ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం.. పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. ఒక కర్రను మరో కర్రతో మధిస్తూ అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ యఙ్ఞాన్ని ప్రారంభించనున్నారు. ఇక జనవరి 20 వ తేదీన వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్యహవచనం కార్యక్రమం ద్వారా రామమందిరం యొక్క గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు.జనవరి 21 వ తేదీన జలాధివాసం అంటే యజ్ఞం చేసిన అనంతరం, ప్రత్యేక పూజల మధ్య అయోధ్య రాముడి విగ్రహాన్ని125 కలశాలతో అభిషేకం చేస్తారు.
84 సెకన్లపాటు శుభగడియలు..
జనవరి 22వ తేదీన మధ్యాహ్న సమయంలో 84 సెకన్ల పాటు శుభ గడియలు ఉన్నాయని.. ఆ సమయంలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే దేశం పేరు మారు మోగిపోతుందంటున్నారు పండితులు.మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ వెల్లడించారు. మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు అయోధ్య ట్రస్ట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.
శ్రీరాముడిని కిరణాలతో అభిషేకించనున్న సూర్యుడు..
అయోధ్యలో కొలువైన రామ మందిరంలో దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయని తెలిపారు. వీటితోపాటు శ్రీరాముని మహా మందిరంలో ఆయన విగ్రహంలోనూ అతీంద్రీయ శక్తులు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఏటా శ్రీరామనవమి నాడు అయోధ్య రామ మందిరంలో అద్భుతం జరుగుతుందని చెప్పారు . ప్రతీ ఏటా శ్రీరామనవమి రోడు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని చంపత్ రాయ్ వెల్లడించారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతీ సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం 9 వ రోజన సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా అయోధ్య రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్టే రాముడి విగ్రహం పొడవు, ఎత్తును రూపకల్పన చేశారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని పేర్కొన్నారు.
51 అంగుళాల రామ్ లల్లా విగ్రహం..
ఆ విగ్రహం పొడవు 51 అంగుళాలు ఉంటుందని.. బరువు 1.5 టన్నులు ఉందని చెప్పారు. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కనిపిస్తుందని వివరించారు. గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలను సిద్ధం చేయగా.. అందులో ఒకదాన్ని …శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా విగ్రహాన్ని ఎంపిక చేశారు. 51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలుడి రూపంలో విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండే ఈ బాల రాముడికి సంబంధించి.. ముగ్గురు శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు. వీటిలో అత్యంత సుందరంగా కనిపించే.. దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేశారు.
మరోవైపు, రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16, 2024 నుంచి మొదలుకానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకు వస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.
ప్రాణ ప్రతిష్టరోజు అన్ని ఆలయాల్లో భజనలు..
మరోవైపు ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీన ఉదయం 10 గంటలకు అన్ని ఆలయాల్లో భజనలు చేయనున్నారు..ఆలయ కమిటీలు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తి అయి హారతి ఇచ్చిన తర్వాతే అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పేర్కొన్నారు. ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక జనవరి 15 వ తేదీ మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీ వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.
రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు..
అ యోధ్య రామయ్యకు తన అత్తగారి రాజ్యం నుంచి వెండి విల్లుతో పాటు అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పుర్ నుంచి సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుకల డబ్బాలతో తరలివచ్చారు. భక్తులు తీసుకొచ్చిన వాటిలో శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, వెండి విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి.
అయోధ్య రామాలయం నిర్మాణ ప్రత్యేకతలు
అయోధ్య రామాలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఈ ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులతో ఉంటే… ఎత్తు 161 అడుగులుంటుంది. రామమందిరం మూడు అంతస్థుల్లో ఉంటుంది. ప్రతి అంతస్థు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 పిల్లర్లు, 44 గుమ్మాలుంటాయి. ఆలయం గర్భగుడిలో బాల శ్రీరాముడి విగ్రహం మొదటి అంతస్థుల్లో ఉంటుంది. అదే శ్రీ రామదర్బార్ గా పిలుస్తారు. రామమందిరంలో ఐదు మంటపాలుంటాయి. నృత్య మంటపం, రంగ మంటపం, సభా మంటపం, ప్రార్ధనా మంటపం, కీర్తన మంటపం. రామమందిరం పిల్లర్లు, గోడలపై దేవీ దేవతల విగ్రహాలు, చిత్రాలతో నిండిపోయి ఉంటుంది.
రామమందిరం ప్రహారీ మూలల్లో నాలుగు మందిరాలుంటాయి. ఇవి సూర్యదేవుడు, దేవి భగవతి, గణేశ్, శివ మందిరాలుగా ఉంటాయి. ఉత్తరం వైపు అన్నపూర్ణ, దక్షిణం వైపు హనుమంతుడి మందిరాలుంటాయి దీర్ఘ చతురస్రాకారంలోని గోడ పర్కోటా పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 అడుగులుంటుంది. ఇది ఆలయం చుట్టూ ఉంటుంది. ఆలయం తూర్పు వైపు నుంచి 32 మెట్లు పైకెక్కితే సింఘ్ ద్వారముంటుంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే భక్తుల సౌకర్యార్ధం ర్యాంపు, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రాచీన చరిత్రకు గుర్తుగా మందిరం సమీపంలో చారిత్రాత్మక సీతాకూపం అనే బావి నిర్మాణముంటుంది. శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, మాతా శబరి, దేవి అహల్య మందిరాలు నిర్మించే ప్రతిపాదన ఉంది.
ఆలయ ప్రాంగణంలోని సౌత్ వెస్ట్‌లో కుబేర్ తిల వద్ద శివుని ప్రాచీన మందిరాన్ని పునరుద్ధరించారు. మొత్తం ఆలయంలో ఎక్కడా ఐరన్ ఉపయోగించకపోవడం విశేషం. ఆలయం ఫౌండేషన్‌ను 14 మీటర్ల మందంతో రోలర్ కంపాక్టెడ్ కాంక్రీట్‌తో నిర్మించారు. భూమిలోని తేమ నుంచి రక్షణ కోసం 21 అడుగుల ప్లింత్ ఉన్న గ్రానైట్ వినియోగించారు. ఆలయం ప్రాంగణంలో మురుగు నీటి శుద్ధి కర్మాగారం, వాట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటాయి. 25 వేలమంది సామర్ధ్యంలో పిలిగ్రిమ్ ఫెసిలిటీ సెంటర్ ఉంటుంది. ఇందులో వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యం ఉంటాయి. ఆలయం ప్రాంగణంలో ప్రత్యేక స్నాన గదులు, వాష్‌రూమ్స్, వాష్ బేసిన్స్, పబ్లిక్ కుళాయిల వ్యవస్థ ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ 70 ఎకరాల్లో పచ్చదనం ఉండేలా ఆలయ ప్రాంగణం ఉంటుంది.
2,500 ఏళ్ల పాటు తట్టుకునేలా నిర్మాణం..
ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా ఈ ఆలయాన్ని డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్ ఆశీశ్ సోంపురా తెలిపారు. ఆలయ నిర్మాణంలో పచ్చదనానికి పెద్దపీట వేసినట్లు వివరించారు. అయోధ్య రామాలయాన్ని భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అష్టభుజి ఆకారంలో గర్భ గుడిని తీర్చిదిద్దుతున్నారు. భారతదేశంలో గర్భ గుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా తక్కువని సోంపురా తెలిపారు. కానీ అయోధ్య రామాలయం గర్భ గుడి ఆ ఆకారంలోనే ఉందని వెల్లడించారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశామని ఆశీశ్ సోంపురా వివరించారు. ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35వేల నుంచి 40వేల మంది ప్రయాణించే అవకాశం ఉంది. వృద్ధులు, అంగవైకల్యం ఉన్న భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ ఇక అయోధ్య శ్రీరాముని ఆలయంలో మొత్తం 46 తలుపులను ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నట్లు ఉత్తరప్రదేశ్ సిఎంఓ కార్యాలయం వెల్లడించింది. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కారణంగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 7వేల మందికి ఆహ్వానపత్రికలు
దేశవ్యాప్తంగా 7 వేల మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు అందాయి.అయితే ఈ ఆహ్వాన పత్రికలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రతీ ఆహ్వన పత్రికపై శ్రీరాముడి చిత్రంతో పాటు రామమందిర ఉద్యమానికి సంబంధించి ముఖ్య సంఘటనలకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక బుక్ లెట్ ఉంది. ఈ రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న వారి వివరాలు కూడా అందులో ఉన్నాయి. ప్రధాన ఆహ్వాన పత్రికపై అయోధ్య రామ మందిర చిత్రం ఉంది.
ఇక ఆ ఆహ్వాన పత్రిక కింది భాగంలో శ్రీరామ్ ధామ్’ అని.. దానికింద అయోధ్య అని ముద్రించారు. ఇక విల్లు, బాణాలు ధరించిన బాల రాముడి చిత్రాలు కూడా ఆ ఆహ్వాన పత్రికలో ఉన్నాయి. జనవరి 22 వ తేదీ ఉదయం 11:30 గంటలకు ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ పూజ ప్రారంభమవుతుందని ఆ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కార్యక్రమానికి సంబంధించిన ప్రముఖ అతిథులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని అందులో పేర్కొన్నారు. ఆహ్వానం ప్రకారం.. అతిథులు బయలుదేరిన తర్వాత సాధువులు రామ్ లల్లా విగ్రహాన్ని దర్శించుకోవడం ప్రారంభిస్తారు. ఈ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. రాముడు తన సొంత గొప్ప దేవాలయ స్థానానికి తిరిగి వస్తున్నాడని అందులో తెలిపారు.
ఇక 1528 నుంచి 1984 వరకు రామ మందిరం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన 76 పోరాటాల్లో పాల్గొన్న వారికి ఆహ్వాన పత్రికలోని బుక్‌లెట్‌ను అంకితం చేశారు. ఈ 76 పోరాటాల నుంచి ప్రేరణ పొంది 1984 అక్టోబర్‌లో సరయు నది ఒడ్డున 77వ పోరాటం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అతిథుల్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, ప్రభాస్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్, బిలియనీర్స్ ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల మంది సాధువులు.. రామాలయ ఉద్యమంలో మరణించిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానాలు పంపించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రాణప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారం…
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతేకాదు.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ స్క్వేర్‌లో రామ మందిరాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. ఆ రోజున టైమ్స్ స్క్వేర్‌లో రామమందిర చిత్రాన్ని ప్రదర్శించారు.
అయోధ్య రాముడి పూజారి మోహిత్ పాండే..
ప్రస్తుతం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ)లో ఎంఏ (ఆచార్య) కోర్సును అభ్యసిస్తున్న మోహిత్ పాండే అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. మోహిత్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన వ్యక్తి, రామాలయం అర్చకుల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వీరందరిలో 200 మంది షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో 50 మందిని ఎంపిక చేశారు. అందులో పాండే ఎంపికయ్యారు. మోహిత్ పాండే పూజారిగా బాధ్యతలు తీసుకునే ముందు ఆరు నెలల శిక్షణను పొందుతున్నాడు.
అయోధ్యరాముడి ప్రసాదం ప్రత్యేకమే…
అయోధ్య నూతన రామాలయంలో అన్నీ ప్రత్యేకమే అయినందున ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆయోధ్య రామాలయంలో భక్తులకు ప్రసాదంగా ఇలాచీ దానా ఇవ్వాలని రామ జన్మభూమి తీర్ఘక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇది యాలుక్కాయలు, చక్కెరతో కలిపి తయారౌతుంది. ఉత్తరాదిన చాలా దేవాలయాల్లో ఈ ప్రసాదం వాడుకలో ఉన్నదే. అయోధ్య రామాలయంలో కూడా ఇదే ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే రామ్ విలాస్ అండ్ సన్స్ సంస్థకు ఇలాచీ దానా తయారు చేసిచ్చే ఆర్జర్ దక్కింది.
ఇలాచీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనం కలగనుంది. ఇలాచీ ఆరోగ్య ప్రయోజనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇలాచీ ప్రాశస్త్యతను దృష్టిలో ఉంచుకుని ఇలాచీ దానాను ప్రసాదంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇకపై అయోధ్య అంటే ఇలాచీ దానా ప్రసాదం విన్పించనుంది.
ప్రధాని మోడీకి అద్భుత అవకాశం…
కోట్లాది మంది హిందువుల కల నెరవేరనున్న వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యద్భుతమైన అవకాశం రానుంది. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహాన్ని స్వయంగా నరేంద్ర మోదీ.. గర్భగుడిలోకి తీసుకురానున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి శ్రీరాముడి విగ్రహాన్ని మోసుకురానున్నారు. 25 సెకన్లలో పూజ మండపం నుంచి అయోధ్య గర్భగుడికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. అయితే ఈ కార్యక్రమం మొత్తం కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో జరగనుంది.
కాగా ఇప్పటివరకు ఉన్న పాత విగ్రహాన్ని అచల మూర్తిగా వ్యవహరిస్తుండగా.. కొత్త తయారు చేసిన విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా పిలవనున్నారు. ఈ విగ్రహాన్ని నీటితో, పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకపోవడం.. దీనికి ఉన్న మరో ప్రత్యేకతగా తెలుస్తోంది. మరోవైపు.. అయోధ్యలో భారీగా భక్తుల రద్దీ నెలకొంటుండటంతో జనవరి 17 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న 5500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం గుజరాత్ నుంచి అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలో పరిశుభ్రత పాటించేలా కుంభ్ మోడల్ ను అమలు చేయాలని సీఎం యోగి..అధికారులను ఆదేశించారు.జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
అయోధ్య మందిరం: అంచనా వ్యయం
ఆలయ నిర్మాణ వ్యయం దాదాపు రూ.300-400 కోట్లు. మొత్తం రామజన్మభూమి కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1100 కోట్లు అవసరం. ఆలయ ట్రస్ట్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని భరిస్తోంది. ట్రస్ట్ ప్రకారం, ఇది ప్రజల నుండి నెలకు దాదాపు రూ. వంటి జూన్ 2022 నాటికి, ట్రస్ట్ ప్రజల నుండి డాన్ (విరాళం) రూపంలో రూ. 3,400 కోట్లు వసూలయ్యాయి. మిగులు సొమ్మును అయోధ్య అభివృద్ధికి వినియోగిస్తామన్నారు.
అయోధ్య రామమందిరం: నిర్మాణ సామగ్రి
రామమందిరం యొక్క నిర్మాణం చెక్కిన రాజస్థాన్ బన్సీ పహర్‌పూర్ రాతితో చేయబడుతుంది, బన్సీ పహర్‌పూర్ ఇసుకరాయి రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలోని బయానా తహసీల్‌లో గుర్తించారు. ఇది గులాబీ మరియు ఎరుపు రంగులలో లభిస్తుంది. అక్షరధామ్ ఆలయం, పార్లమెంట్ కాంప్లెక్స్ మరియు ఆగ్రాలోని లాల్ క్విలాతో సహా దేశంలోని వివిధ గొప్ప నిర్మాణాలలో బన్సీ పహాద్‌పూర్ ఇసుకరాయి ఉపయోగించారు.
ఈ ఆలయాన్ని ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ భాయ్ సోంపూరా రూపొందించారు, అతని తాత ప్రభాకర్జీ సోంపురా తన కుమారుడు ఆశిష్ సోంపురాతో కలిసి సోమనాథ్ ఆలయాన్ని రూపొందించారు. 79 ఏళ్ల వాస్తుశిల్పిని 1992లో నియమించారు. తూర్పున ఉన్న ప్రవేశ ద్వారం గోపురం శైలిలో నిర్మించారు. ఇది దక్షిణ దేవాలయాలను సూచిస్తుంది. ఆలయ గోడలు రాముడి జీవితాన్ని వర్ణించే కళాకృతులను ప్రదర్శిస్తాయి. మందిరం యొక్క గర్భగుడి అష్టభుజాకారంలో ఉంటుంది, అయితే నిర్మాణ చుట్టుకొలత వృత్తాకారంగా ఉంటుంది. మందిర్‌లో 161 అడుగుల ఎత్తుతో ఐదు గోపురాలు మరియు ఒక టవర్ ఉంటుంది. 3-అంతస్తుల ఆలయంలో ఒక కేంద్రం ఉంటుంది. సూర్యకిరణాలు రామ్ లల్లా విగ్రహంపై పడేలా నిర్మించబడింది, ఇది శిశు స్వరూపం.
రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందే వారం రోజుల నుంచి వివిధ క్రతువులు జరగనున్నాయి. ఆ కార్యక్రమాలకు భక్తులు ఇప్పటి నుంచే తరలివస్తున్నారు. దీంతో అయోధ్య నగరంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వంద ఎలక్ట్రిక్ బస్సులను రంగంలోకి దించింది. పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఈ ఎలక్ట్రిక్ బస్సులు వినియోగించడం వల్ల రద్దీ, కాలుష్యం తగ్గి పర్యావరణ హితంగా ఉంటుందని భావిస్తోంది.
వాల్మీకి మహర్షి ఎయిర్ పోర్టు, అయోధ్య దామ్ జంక్షన్..
అయోధ్య రాముడి దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయోధ్యకు చేరుకునేందుకు రవాణా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలె అయోధ్య ఎయిర్పోర్ట్ పూర్తి అయింది. మరోవైపు.. అయోధ్యలో ఉన్న రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించి.. ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించారు. కొత్త ఎయిర్‌పోర్టు సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర ప్రారంభించారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. అయోధ్య రైల్వే స్టేషన్‌కు అయోధ్య ధామ్ జంక్షన్‌గా పేరు పెట్టారు. అడ్వాన్స్డ్ సదుపాయాలు, తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వర్షపు నీటిని సంరక్షించడం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు.కొత్తగా 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, భక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు.
అయోధ్యలోని హోటల్ గదుల రేట్లు భారీగా పెరిగి ఆకాశాన్నంటాయి. కొన్నిచోట్ల ఒక్కో గది రేటు రూ.లక్షకు చేరడంతో సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలింది. అటు వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. మార్చి వరకు బుకింగ్స్ అయిపోయాయని.. ఆ తర్వాతే కొత్త బుకింగ్స్ ప్రారంభం అవుతాయని పేర్కొంటున్నారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో భద్రతా కారణాల దృష్ట్యా హోటల్ బుకింగ్‌లను అధికారులు రద్దు చేస్తున్నారు. అయోధ్యలో ప్రస్తుతం 30 వరకు హోటళ్లు ఉన్నాయి. అందులో రెండు మూడే 4 స్టార్ హోటళ్లు ఉండగా… మిగిలినవన్నీ 2, 3 స్టార్ల హోటళ్లే ఉన్నాయని అయోధ్య అధికారులు వెల్లడించారు. అయితే రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరాముడి వివిధ పేర్లతో సంబోధిస్తున్నారు. బాల రాముడు, రామ్ లల్లాగా మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో రాముడు, రాం లల్లా ఒక్కటేనా.. అయితే వేర్వేరుగా ఎందుకు పిలుస్తున్నారు. రామ్ లల్లా అంటే అర్థం ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రామ్ లల్లా అంటే బాల రాముడు…
తులసీదాస్ రచించిన రామచరిత మానస్‌లో బాల రాముడిని రామ్ లల్లాగా రచయిత అభివర్ణించారు. ఈ పేరు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా రామ్ లల్లా పేరును ఎక్కువగా వాడుతున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. దీనిని రామ్ లల్లాగా పిలుస్తున్నారు. ఇక ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే.. అప్పట్లో అయోధ్యలో చిన్న పిల్లలను లల్లా అని పిలిచేవారట. ఐదారేళ్ల వరకు బాల రాముడిని కూడా అందరూ రామ్ లల్లా అని సంబోధించే వారని తులసీదాస్ తన రామచరి మానస్‌లో అభివర్ణించారు. అందుకే అయోధ్య రాముడిని కూడా రామ్ లల్లాగా పిలవబోతున్నారు.
1528 మరియు 1529 మధ్య, బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించాడు. అయితే, ఇది రాముడి జన్మస్థలమని పేర్కొంటూ హిందూ సమాజానికి చెందిన సభ్యులు కూడా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆ సైట్ తదనంతరం వివాదాస్పద స్థలంగా మారడంతో పాటు సుదీర్ఘమైన, న్యాయ పోరాటం జరిగింది. టైటిల్ వివాదాన్ని నవంబర్ 9, 2019న ముగించారు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రాముడి జన్మస్థలంగా సుప్రీంకోర్టు అంగీకరించింది.













