మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది మేమే .. విచారణ వెంటనే నిలిపివేయండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లో పర్యటించిన సందర్భంగా భద్రతా లోపంతో కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపై నిలిచిపోయింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) కీలక ప్రకటన చేసింది. మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనని ప్రకటించినట్టు సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మోదీ కాన్వాయ్ రోడ్డుపై నిలిచిపోవడానికి కారణం తామేనని, భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, ఈ ఘటనపై ఓఎన్సీవో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపవద్దని న్యాయవాదులను బెదరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. న్యాయవాదుల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిన్న ఉదయం 10:40 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 12:36 గంటలకు మరోసారి రికార్డెడ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం వెనక ఉన్నది తామేనని అందులో వారు అంగీకరించారు. ఆ ఫోన్‌కాల్‌లో హెచ్చరించారు.
అంతేకాదు, విచారణ చేపడితే జాతీయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని కూడా హెచ్చరించినట్టు ధర్మసనానికి రాసిన లేఖలో న్యాయవాదుల సంఘం పేర్కొంది. సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని న్యాయవాదులు తమ ఫోన్లలో సేవ్ చేసుకున్నారని, అవి కనుక హ్యాకింగ్‌కు గురైతే ఆ వివరాలన్ని దుర్వినియోగం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫోన్ కాల్స్ న్యాయవాదులందరికీ వస్తున్నట్టు పేర్కొంటూ దీపక్ ప్రకాశ్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.













