గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ లేదు: గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గరపడుతోంది. ఇలాంటి సమయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్టోబర్ 17వ తేదీన జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీచేయడం లేదని గెహ్లాట్ వెల్లడించారు. కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని కలిసేందుకు ఆయన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గెహ్లాట్.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని చాలాసార్లు కోరానని, అయితే ఈ సారి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ ఈ స్థానానికి పోటీపడటం లేదని రాహుల్ స్పష్టంగా చెప్పేశారని చెప్పారు. అలాగే తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీడుతున్నట్లు ధ్రువీకరించారు. త్వరలోనే నామినేషన్ వేసే తేదీని కూడా ప్రకటిస్తానని చెప్పాడు. విపక్షాలు పటిష్టంగా ఉండాల్సిన సమయం వచ్చిందని, ప్రస్తుతం దేశం ఏ స్థితిలో ఉందో అందరికీ కనిపిస్తోందని అన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైతే ఆ తర్వాత ఏం చేయాలనే విషయాన్ని అజయ్ మాకెన్, సోనియా గాంధీ చూసుకుంటారని పేర్కొన్నారు.













