నిజంగా బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే.. ఆ పని చేసి చూపించండి.. నితీశ్‌కు పీకే సవాల్
ఇటీవలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్. మళ్లీ అవసరం అయితే బీజేపీతోనే కలుస్తారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్‌పై స్పందించిన నితీశ్ కుమార్.. పబ్లిసిటీ కోసమే ప్రశాంత్ కిశోర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. దీంతో నితీశ్‌పై మరోసారి ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. భాజపాతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ.. ఇంకా ఆ పార్టీతో బంధాన్ని నితీశ్ కొనసాగిస్తున్నారని పీకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా రెండు పడవలపై పయనం ప్రతిసారీ సాధ్యం కాదన్న పీకే.. ‘నితీశ్ కుమార్ గారూ.. బీజేపీ/ఎన్డీఏతో మీకు నిజంగా ఎలాంటి బంధం లేకపోతే, మీ ఎంపీని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోమని చెప్పండి. ప్రతిసారీ ఇలా రెండు పడవలపై ప్రయాణం మీకు సాధ్యం కాదు’ అని తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.













