వ్యాక్సినేషన్ పై వచ్చే పుకార్లను పరిగణనలోకి తీసుకోకండి : మోదీ పిలుపు

కరోనా వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను ఏమాత్రం నమ్మవద్దని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. శాస్త్రవేత్తలపై అందరమూ పూర్తి విశ్వాసంతో మలుచుకోవాలని పిలుపునిచ్చారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రంలో భాగంగా మోదీ తన భావాలను పంచుకున్నారు. ‘‘వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను నమ్మకండి. నేను కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. మా అమ్మకు 100 సంవత్సరాలు. ఆమె కూడా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నారు. వ్యాక్సిన్లపై పుకార్లను విశ్వసించకండి’’ అంటూ మోదీ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో ఎవరూ సందిగ్ధానికి తావివ్వకూడదని, సందిగ్ధాన్ని అధిగమించి, వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. దేశంలో వ్యాక్సినేషన్ అత్యంత వేగంతో జరుగుతోందని, ఒకే రోజులో 86 లక్షల కన్నా ఎక్కువ మంది వ్యాక్సినేషన్ తీసుకొని చరిత్ర సృష్టించారని సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని, కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఈ పోరులో ప్రజలందరూ సహకరిస్తున్నారని, అందుకే కాస్త విజయాన్ని సాధించామని మోదీ పేర్కొన్నారు.