అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మోదీ శంకుస్థాపన
ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథడు కొలువైన వారణాసిలో నూతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. స్టేడియానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ ఈ రోజు వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన జరిగింది. మహాదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆయనకే అంకితం. ఇది పూర్వాంచల్ యువతకు వరం కానుంది. ప్రపంచం మొత్తం క్రికెట్ ద్వారా భారత్‌తో కనెక్ట్ అయింది. క్రికెట్ ఆడేందుకు ఇప్పుడు కొత్త దేశాలు ముందుకు వస్తున్నాయి అని అన్నారు. నమో అని రాసి ఉన్న టీమ్ఇండియా జెర్సీని ప్రధానికి సచిన్ తెందూల్కర్ అందజేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మోదీకి క్రికెట్ బ్యాట్‌ను జ్ఞాపికగా బహుకరించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, టీమ్ఇండియా దిగ్గజాలు సచిన్ తెంద్కూలర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, కపిల్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.













