మన గళాన్ని ప్రపంచం వింటున్నది : మోదీ
ప్రపంచంలో మన దేశ ఉత్పత్తులేగా, మన గొంతుక (మీడియా) కూడా ప్రాచుర్యం పొందుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ గళాన్ని యావత్ ప్రపంచం శ్రద్ధగా వింటున్నదని చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో భారత మీడియా ప్రపంచం నలుమూలలకు విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ప్రముఖ మీడియా సంస్థ పత్రిక గ్రూప్.. పత్రిక గేట్ పేరుతో పర్యాటకులకు కనువిందు చేసే ఒక ద్వారాన్ని నిర్మిచింది. దీనిని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతోపాటు పత్రికా గ్రూప్ చైర్మన్ గులాబ్ కొఠారీ రచించిన సంవాద్ ఉపనిషత్, అక్షర్యాత్ర అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత మీడియాను ప్రశంసించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా ముఖ్య భూమిక పోషించిందన్నారు.













