రూ.3,076 కోట్లు.. విరాళాలు ఇచ్చిన దాతలెవరు?
కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిధిని ఏర్పాటు చేసిన అయిదు రోజుల్లోనే పీఎం కేర్స్‌కు సుమారు రూ.3076 కోట్లు విరాళంగా వచ్చాయి. మార్చి 27 నుంచి మార్చి 31 వరకే ఆ భారీ మొత్తం పీఎం కేర్స్ ఖాతాలోకి చేరింది. దీంట్లో కేవలం రూ.39.67 లక్షలు మాత్రమే విదేశీ వాటా. మిగతా అంత స్వదేశీ విరాళాలే. దీనికి సంబంధించిన ఆడిట్ ప్రకటనను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. పీఎం కేర్స్ కార్పస్ ఫండ్‌లో రూ.2.25 లక్షలు ఉన్నాయి. ఇక వడ్డీ రూపంలో రూ.35 లక్షలు వచ్చాయి. కేవలం అయిదు రోజుల్లో మూడు వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్రాన్ని ప్రశ్నించారు. పీఎం కేర్స్ నిధికి విరాళం ఇచ్చిన దాతల వివరాలను వెల్లడించాలని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వారి పేర్లను ఎందుకు వెల్లడించం లేదని ఆయన ప్రశ్నించారు. దాతల పేర్లను ప్రతి ఎన్జీవో కానీ ట్రస్టు కానీ వెల్లడిస్తుందని, కానీ పీఎం కేర్స్‌కు ఎందుకు ఆ మినహాయింపు ఇస్తున్నారని చిదంబరం ట్వీట్ చేశారు.













