లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. సభాపతి పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రకియ చేపట్టారు.
సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్ సింగ్‌తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం ముజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంట రాగా, ఓం బిర్లా సభాపతి పీఠం పై ఆసీనులయ్యారు. ఆయనకు మోదీ, రాహుల్ సహా లోక్‌సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు.