కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేయాలి: నితీశ్ కుమార్
బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ‘ప్రధాన ఫ్రంట్’ ఏర్పాటు చేయాలని, 2024లో బీజేపీని ఓడించాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తేనే బీజేపీని ఓడించడం సాధ్యమవుతుందని అన్నారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ 109వ జయంతి సందర్భంగా హరియాణాలోని ఫతేబాద్‌లో ఆదివారం నాడు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల ఐక్యతా వేదికగా వివిధ విపక్ష పార్టీల నేతలు ఈ సభలో పాల్గొనడం గమనార్హం. వీరిలో ఎన్సీపీ సుప్రీం శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్, ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, శివసేన నేత అర్వింద్ సావంత్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. తనకు ప్రధాని అవ్వాలన్న ఆశ లేదని, తాను ప్రధాని అభ్యర్థిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తృతీయ కూటమి ప్రసక్తే లేదని, బీజేపీని గట్టి దెబ్బ తీయడమే విపక్షాల లక్ష్యంగా ఉండాలని అన్నారు. దీనికోసం విపక్షాలతో ప్రధాన ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీలు కలిసిరావాలని, వీరంతా ముందుకొచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలని కోరారు. జాతీయ స్థాయిలో అందరూ ఏకం కావాలన్నదే తన ఏకైక కోరికని, మరిన్ని పార్టీలను కూడా కలుపుకొని ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు.
నితీశ్‌కు పవార్ మద్దతు
విపక్ష పార్టీలన్నీ ఐక్యత సాధించాలని శరద్ పవార్ కూడా అన్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలంటే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రద్దు చేసిన మూడు సాగు చట్టాలే కాదని, కేంద్ర ప్రభుత్వం పలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని ఆరోపించిన ఆయన.. రైతులకు వాగ్దానం చేసిన కనీస మద్దతు ధరను కూడా అమలు చేయలేదని, అలాగే నిరసనల సమయంలో రైతులపై పెట్టిన కేసులు కూడా వాపస్ తీసుకోలేదని కేంద్రాన్ని విమర్శించారు.













