ఇది ట్రైలరే.. చేయాల్సింది చాలా ఉంది: పీఎం మోదీ
పదేళ్ల పాలనలో తాము ఇప్పటివరకు చేసిందంతా ట్రైలరేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో దేశాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించిందని, అయితే ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందని, ప్రజలు కన్న కలలు నెరవేరుస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని చురు వేదికగా శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని.. ఈ పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడమే కాకుండా.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.
శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై పరోక్ష విమర్శలు చేసిన ప్రధాని.. బీజేపీ ఏదైతే చెప్పిందో అది చేసి చూపిస్తుందని, ఇతర పార్టీల్లా కాకుండా బీజేపీ కేవలం మేనిఫెస్టో విడుదల చేసి చేతులు దులుపుకోదని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే సంకల్పంతో ముందుకు సాగుతుందని అన్నారు. 2019లో తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ దాదాపు నెరవేర్చామని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని విభజించడం, సైన్యాన్ని అవమానించడమే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ అని పేర్కొన్న మోదీ.. భారత్ సర్జికల్ దాడులు, వాయుదాడులు జరిపినప్పుడు కాంగ్రెస్, విపక్ష కూటమి నేతలు ఆధారాలు చూపించాలని అడిగారని, అయోధ్యలో రామమందిరం అంశం విషయంలోనూ మౌనంగా ఉండాలని తమ పార్టీ యూనిట్లకు కాంగ్రెస్ అడ్వయిజరీ జారీ చేసిందని మోదీ విమర్శించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భరతమాతను తలదించుకోనీయబోమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే చురు లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికరమైన పోరు నెలకొననుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రకుల్ కాశ్వాన్.. కాంగ్రెస్ అభ్యర్థి రఫీఖ్ మండేలియాను ఓడించారు. కానీ ఈ దఫా ఆయన పార్టీ మారి కాంగ్రెస్లో చేరడమే కాకుండా.. ఆ పార్టీ తరపున ఇదే నియోజకవర్గంలో పోటీకి నిలబడ్డారు. ఆయనకు పోటీగా బీజేపీ దేవేంద్ర ఝఝారియాను బరిలోకి దింపింది. కాగా.. మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా.. చురు నియోజకవర్గంలో ఏప్రిల్ 19న జరగనున్న తొలి విడతలో పోలింగ్ జరుగనుంది.













