అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశించారు : మంత్రి అమర్నాథ్
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన స్థలానికి ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన వైద్యుల బృందాన్ని క్షతగాత్రులకు చికిత్స అందించడానికి పంపామని తెలిపారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్లకు రెస్పాండ్ కాని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఆదేశించారని వెల్లడిరచారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని సీఎం చెప్పారన్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి 104, 108 వాహనాలతో పాటు డాక్టర్లను కూడా తరలిస్తున్నామని తెలిపారు. రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వారు ఉన్నారని తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారని వెల్లడిరచారు. ఐదుగురి ఫోన్లు స్విచ్ఛాప్‌లో ఉన్నాయని, మరో ఇద్దరి ఫోన్లు నాట్ రిచబుల్ అని వస్తున్నాయన్నారు. ఐదుగురు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయన్నారు.













