అనాథలను అక్కున చేర్చుకోండి : కేంద్ర హోంశాఖ సూచనలు
కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది చనిపోతున్నారు. దీంతో ఈ ప్రభావం కుటుంబాలపై పడుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై పడుతోంది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి, పిల్లలు అనాథలైపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలను కాపాడాలని, అన్ని రాష్ట్రాలకూ విజ్ఞప్తి చేసింది. బాలలతో సహా బలహీన వర్గాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోరింది. దీన్ని సాకుగా తీసుకొని మానవుల అక్రమ రవాణా జరగకుండా నిరోధించాలని, తగు జాగ్రత్తలు తీసుకోడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కోవిడ్ బాధిత వర్గాలపై ఎలాంటి నేరాలూ జరగకుండా చూసుకోవాలని సూచించింది.
ఈ బాధితులందరికీ సకాలంలోనే సహాయం అందేలా చూడాలని, ప్రస్తుతం అమలులో ఉన్న సహాయక చర్యలను సమీక్షించి, మరింత మెరుగైన సహాయ, సహకారాలు అందేలా చూడాలని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఆయా వర్గాలకు అందిస్తున్న పథకాలను వారికి వివరించాలని పేర్కొంది. ఈ అంశాలపై పోలీసులు, ఆయా ప్రభుత్వ శాఖలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది.













