ఎంపీలకు కేంద్రం షాక్…వేతనాల్లో 30 శాతం కోత
కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కొవిడ్‌పై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఏడాది పాటు ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బిల్లును సోమవారం సభలో ప్రవేశ పెట్టగా మంగళవారం ఆమోదం లభించింది. ఎంపీల వేతనాలు, పింఛన్లలో 30 శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఏప్రిల్ 6న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఎంపీలందరి వేతనాల్లో ఏప్రిల్ నుంచి ఏడాది పాటు ఈ కోత పడనుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారు. ఈ మొత్తం సంఘటిత నిధి జమకానుంది. అలాగే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.













