మరోసారి మహాకూటమికి రంగం?.. సోనియాను కలవనున్న ఇద్దరు సీనియర్ నేతలు!
జాతీయస్థాయిలో మరోసారి కాంగ్రెస్ కేంద్రంగా మహాకూటమి ఏర్పాటు జరుగుతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనికోసం భారీ కసరత్తు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బీహార్‌లో మహా కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసేందుకు సమాయత్తం అవుతున్నారట. వీళ్లిద్దరూ ఆదివారం సాయంత్రం ఢిల్లీ పయనం అవబోతున్నారనే వార్త ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తోంది. నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ సోనియాగాంధీతో సమావేశం కావడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా పాల్గొంటారని సమాచారం. అయితే భారత్ జోడో యాత్రలో ఉన్నరాహుల్గాంధీ ప్రస్తుతం కేరళలో ఉన్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ఆయన ఢిల్లీ వెళ్తారా? లేక సోనియాను కలిసిన తర్వాత ఈ ఇద్దరు నేతలు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొంటారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













