కాల్పుల విరమణకు కట్టుబడదాం : దాయాదితో కుదిరిన ఒప్పందం
భారత్, పాక్ దేశాలు హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి ఇక నుంచి కాల్పులు జరపవద్దని పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడంతో పాటు, శాంతిని సాధించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనల వల్ల తరుచూ హింస చెలరేగుతోందని ,ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులుపేర్కొన్నారు. అయితే ఈ పరస్పర అంగీకారం వల్ల నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని భారత్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సరిహద్దు వల్ల మాత్రం బలగాల మోహరింపు అలాగే ఉంటుందని, అక్రమ చొరబాట్లను నిరోధించడానికి మాత్రమే ఈ నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సరిహద్దుకు ఇరు వైపులా కాల్పులు పూర్తిగా నిలిచిపోయాయి.
2003 లో కుదిరిన ఒప్పందం
ఇరు దేశాల మధ్య తరుచూ యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో 2003 లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సరిహద్దులు శాంతిగా ఉండాలంటే ఈ అంగీకారానికి ఇరు దేశాలూ ఆమోదం వేయాల్సిందేనని తీర్మానించుకున్నాయి. కానీ పాక్ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కేసింది. చాలా సార్లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతూ దొంగ దెబ్బలు తీయాలని ప్రయత్నించింది. అయితే భారత సైన్యం సమర్థమంతంగా తిప్పికొట్టింది. కేవలం ఈ యేడాదే పాక్ 3,800 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పౌరులు నివసించే ప్రదేశాల్లోనూ పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడిందని, డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడిచిందని అధికారులు తెలిపారు. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతిసారీ దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరిపామని భారత్ కొన్ని రోజుల క్రిందటే ప్రకటించింది. ఓ రకంగా చెప్పాలంటే గత 17 ఏళ్లలో 2019 లోనే అత్యధిక సార్లు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇప్పటికే చాలా సార్లు ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు దాయాది పాక్ నటించింది. ఈ ఒప్పందాన్నైనా అమలుపరుస్తుందా? లేదంటే ఎప్పటిలాగేనా? అన్నది చూడాలి.
తెర వెనుక మంత్రాంగం నడిపిన ఇండియన్ జేమ్స్‌బాండ్ దోవల్
ఇరు దేశాల మధ్య చాలా రోజుల నుంచి చర్చల్లేవ్. కలుసుకోవడాలూ లేవు. దీన్ని ఆసరాగా చేసుకొని చైనా దాయాది పాకిస్తాన్‌ను భారత్‌పైకి ఉసిగొల్పింది. దీంతో సంబంధాలు మరింత ఇరకాటంలోకి వెళ్లాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పాక్ ఈ ఒప్పందంపై ఎలా సంతకం చేసింది? ఎవరి మాట విని సంతకం చేసింది? అన్నది ప్రశ్న. దీని వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర చాలా ఉందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అజిత్ దోవల్ పాక్‌తో జరిపిన చర్చల ఫలితమే ఈ ఒప్పందమని సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు దోవల్ కొన్ని రోజుల పాటు నిత్యమూ ప్రధాని ఇమ్రాన్ భద్రతా సలహాదారు మొయాద్ యూసుఫ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చల సారాంశం కేవలం ముగ్గురు కేంద్ర మంత్రులకు మాత్రమే తెలుసని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర హోంమంత్రి షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మాత్రమే ఈ విషయం తెలుసని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.
స్వాగతించిన పీడీపీ
భారత్, పాక్ మధ్య కుదిరిన అంగీకారాన్ని పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీ స్వాగతించింది. భారత్, పాక్ మధ్య కుదిరిన పరస్పర అంగీకారాన్ని తాము స్వాగతిస్తామని పీడీపీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిని ఆచరణలో చూపిస్తారని విశ్వసిస్తున్నామని, ఈ ఒప్పందానికి తామెప్పుడూ మద్దతిస్తున్నామని తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా తిరిగి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుందని పీడీపీ పేర్కొంది.













