రాందేవ్ బాబా కు షాక్…రూ.1000 కోట్ల పరువు నష్టం దావా

కరోనాను నియంత్రించడంలో అల్లోపతి వైద్యం విఫలమైందంటూ ఆరోపణలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ శాఖ రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. కరోనా కట్టడి విషయంలో అల్లోపతి వైద్యంపై తాను చేసిన ప్రకటనలపై క్షమాపణ కోరుతూ వీడియోను పోస్టు చేయకపోయినా, రాబోయే 15 రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పకపోయినా, రాందేవ్ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ తమ పరువు నష్టం దావా నోటీసులో పేర్కొన్నది. రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్‍కు కూడా ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ లేఖ రాసింది.
అల్లోపతి వైద్యంపై ఇటీవల రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అల్లోపతి పనికిమాలిన వైద్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‍మీడియాలో వైరల్‍గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్యంపై మీ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. మీ మాటలు ఉపసంహరించుకోండి అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ రాందేవ్ బాబాకు ఘాటుగా లేఖ రారు. దీంతో వెనక్కి తగ్గిన రాందేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.