బాంబే హైకోర్టు అలాంటిదే మరో తీర్పు…
స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాకపోతే అది లైంగిక దాడి కాదు అని తీర్పు చెప్పిన కొన్ని రోజులకే బాంబే హైకోర్టు అలాంటిదే మరో తీర్పు వెలువరించింది. మైనర్ బాలిక చేయి పట్టుకోవడం, అమె ప్యాంటు జిప్ తీయడం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అపెన్సెస్ యాక్ట్ (పోక్సో) కింద లైంగిక దాడి కాదని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ చెప్పింది. అది ఐపీసీ సెక్షన్ 354 కింద లైంగిక వేధింపుల కిందికి వస్తుందని సృష్టం చేసింది. ఓ ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 50 ఏళ్ల వ్యక్తికి ట్రయల్ కోర్టు పోక్సో చట్టం సెక్షన్ 10 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది.
దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయగా.. అది పోక్సో చట్టం కింద లైంగిక దాడి కాదని జస్టిస్ పుష్ప గనేడివాలా సృష్టం చేశారు. ఆ చట్టం కింద విధించిన శిక్షను రద్దు చేశారు. గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించగలిగే ఐపీసీ సెక్షన్ 354 కింద నిందితుడిపై అభియోగాలు మోపారు. అయితే అప్పటికే అతడు ఐదు నెలల జైలు శిక్ష అనుభవించి ఉండటంతో.. ఈ నేరానికి ఆ శిక్ష సరిపోతుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 19న కూడా ఇదే న్యాయమూర్తి నేరుగా శరీరాన్ని స్పృశించకుండా ఓ మైనర్ బాలిక స్థనాలను తాకడం పోక్సో చట్టం కింద లైంగిక దాడి కాదని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.













