ఉపాధ్యాయుడు రంజిత్ కు గ్లోబల్ బహుమతి…7.37 కోట్ల ప్రైజ్ మనీ
బాలికా విద్యను ప్రోత్సహించినందుకు, బాలికలను చదివించినందుకు మహారాష్ట్రలో ఉపాధ్యాయుడిగా ఉన్న రంజిత్‌సిన్హ్ దిసాలే(32)కు గ్లోబల్ టీచర్ బహుమతి లభించింది. ఈ బహుమతి కింద రూ.7.37 కోట్లను ఆయన గెలుచుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పరిటేవాడీలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రంజిత్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇక్కడ గిరిజన బాలికలకు విద్య ఒక్కటే కాదు, భాష కూడా సమస్యే. ఆ బాలికలకు కన్నడ మాత్రమే తెలుసు. దీంతో రంజిత్ కన్నడ నేర్చుకొని విద్యాబోధన చేశారు. దీంతో పాటు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు పాఠ్యపుస్తకాలన్నింటినీ కన్నడలో క్యూఆర్ కోడ్‌తో రీడిజైన్ చేయించారు. మహారాష్ట్రలో ఈవిధంగా చేసిన తొలి పాఠశాల అదే. రంజిత్ కృషితో 2016లో ఈ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాల అవార్డు పొందింది. అదే ఏడాది ‘ఇన్నొవేటివ్ రిసర్చర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది. తనకు దక్కిన బహుమతిలో (7.37 కోట్లు) సగం డబ్బును తన పది మంది ఫైనలిస్టులతో పంచుకుంటానని దిసాలే పేర్కొనడం విశేషం.













