ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులను విధుల్లోకి తీసుకోనున్న కేంద్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంది. ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బందిని పెంచాలని, వారి కొరత లేకుండా చూసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కోవిడ్ బాధితుల చికిత్స నిమిత్తమై ఎంబీబీఎస్ పాసైనవారు, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే నీట్- పీజీ పరీక్షను 4 నెలల పాటు వాయిదా వేయాలని కూడా ప్రధాని కార్యాలయం సూచించింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసేందుకే ఈ నిర్ణయమని సోమవారం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే బీఎస్సీ, జీఎన్‌ఎం ఉత్తీర్ణులైన నర్సులను సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి విధుల్లోకి తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అలాగే కోవిడ్ డ్యూటీ 100 రోజులు పూర్తి చేసుకున్న వైద్య ఉద్యోగులకు రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యతను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.