భారత్ లో ఆ సాంప్రదాయం ముందు నుంచే…

భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ చట్టాలకు లోబడే తాము పనిచేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. స్థానిక చట్టాలకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు అనుగుణంగా తాము సేవలు అందించనున్నట్లు తెలిపారు. కొత్త ఐటీ నిబంధనలు ఇప్పుడిప్పుడే అమలులోకి వచ్చాయని, లోకల్ టీమ్స్ వాటి గురించి విశ్లేషిస్తున్నారని, తమ సేవలు ఉన్న అన్ని దేశాల్లోనూ స్థానిక చట్టాలను గౌరవిస్తామని, వారితో కలిసి పనిచేస్తామని, తమ నివేదికలన్నీ పాదర్శకంగా ఉన్నాయని అన్నారు. ఫ్రీ, ఓపెన్ ఇంటర్నెట్ వ్యవస్థీకృతమైందని, భారత్‍లో ఆ సాంప్రదాయం ముందు నుంచే ఉందన్నారు.
రాజ్యాంగ విధానాలను తమ కంపెనీ గౌరవిస్తుందని, అవసరమైన చోట వెనక్కి తగ్గినట్లు కూడా ఆయన తెలిపారు. టెక్నాలజీతో ప్రపంచ రూపురేఖలు మారిపోయాయని, సాంకేతిక పరిజ్ఞానం సమాజాన్ని మార్చేసిందన్నారు. యూరోప్‍లో కాపీరైట్ ఆదేశాలు ఉన్నాయని, భారత్‍లో సమాచార నియంత్రణ ఉందని, ఇలా వివిధ దేశాల్లో ఉన్న సమస్యలను పరిగణించి తాము ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‍పై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త ఐటీ నిబంధనలు ప్రకటించిన విషయం తెలిసిందే. అవి తక్షణమే అమల్లోకి రాగా, దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం 3 నెలలు వెసులుబాటు కల్పించింది. ఆ గడువు ముగియడంతో నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.