గోద్రా రైలు దహనం కేసు… దోషులకు ఊరట
గుజరాత్లో 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషులకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 17 ఏళ్లుకు పైగా జైలు జీవితం పూర్తి చేసుకున్నారనే దాన్ని ఆధారంగా చేసుకుని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఎనిమిది మంది ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. నేరంలో కీలక పాత్ర దృష్ట్యా మరో నలుగురు దోషుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఈ నలుగురికి ట్రయల్ కోర్టు తొలుత మరణ శిక్ష విధించగా, తదనంతరం గుజరాత్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. 2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్లో ఓ రైలుకు నిప్పంటంచిన ఘటనలో దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గుజరాత్లో పెద్దఎత్తున అల్లర్లకు దారితీసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2011లో 11 మంది దోషులకు మరణ శిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది.
తదనంతరం గుజరాత్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. అయితే, 11 మంది మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీంతో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దోషులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీలు 2018 నుంచి ఇక్కడ పెండిరగ్లో ఉంది. ఈ కేసులో దోషులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని గుజరాత్ ప్రభుత్వం బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా వాదించింది. అయితే పిటిషన్‌దారులు ఇప్పటికే 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారని వారి తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎనిమిది మందికి బెయిల్ మంజూరయ్యింది.













