గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు వీలుగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌కు వెళ్లిన సావంత్ తన రాజీనామా లేఖను గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైకు అందజేశారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 20 స్థానాలను గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క స్థానానికి ముందు ఆగిపోయింది. దీంతో ముగ్గురు స్వతంత్రులతో పాటు మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీర్చేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తున్న వేళ తదుపరి సీఎంగా సావంత్‌నే కొనసాగిస్తారా? కొత్త నేతకు అవకాశం కల్పిస్తారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అంశాన్ని బీజేపే సస్పెన్స్‌లో ఉంచింది. ఈ ఎన్నికల్లో సీఎం ప్రమోద్ సావంత్ కేవలం 66 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలవడంతో ఆయన్ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













