కేంద్రం కీలక ప్రకటన.. ఆ ఉద్యోగులు
కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల శిశు సంరక్షణ సెలవులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మహిళలు, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్స్ కు అర్హులని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్, ఇతర విభాగాల్లో నియమితులైన మహిళా, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్ 1972లోని 43సీ ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్)కి అర్హులని తెలిపారు. వారి మొదటి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ వారి సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్ఠంగా 730 రోజులు సెలవు తీసుకోవచ్చని వెల్లడించారు. దివ్యాంగులైన పిల్లల విషయంలో మాత్రం వయోపరిమితి లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.













