సుప్రీంకోర్టు కీలక తీర్పు… ఆ అధికారం ఈడీకి ఉండదు

మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఈ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ సదరు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది.
పీఎంఎల్‌ఏ చట్టం సెక్షన్ 44 కింద దాఖలైన మనీలాండరింగ్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే గనుక, ఈ కేసుల్లో నిందితుడిగా చూపించిన వ్యక్తిని సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉండదు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరైతే దాన్ని కస్టడిలో ఉన్నట్లుగా పరిగణించకూడదు. ఒకవేళ తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని ఈడీ కస్టడీకి తీసుకోవాలంటే, అప్పుడు దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ఈడీ కారణాలతో కోర్టు సంతృప్తి చెందితేనే కస్టోడియల్ విచారణకు అనుమతినిస్తుందని అని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడిరచింది.