దేశవ్యాప్తంగా ఉచితంగా కొవిడ్ టీకా..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలో టీకా డ్రైరన్ సందర్భంగా ఆయన ఓ హాస్పిటల్‌ను సందర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలోని జీటీబీ దవాఖానలో డ్రైరన్ ప్రక్రియను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీకా భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడం తమ ప్రాధాన్యత అని చెప్పారు. పోలియో టీకా సమయంలో వివిధ రకాల పుకార్లు వ్యాపించాయి. కానీ ప్రజలు టీకా తీసుకున్నారు. దీంతో భారత్ ఇప్పుడు పోలియో రహిత దేశంగా మారిందని చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవీషీల్డ్ టీకాను అత్యవసరంగా వినియోగించేందుకు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డీజీసీఐ అనుమతి ఇంకా రావాల్సి ఉన్నది. పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. కోవీషీల్డ్ టీకాను తయారు చేస్తున్నది. సబ్జక్ట్ ఎక్ష్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఇచ్చిన నివేదికను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలించనున్నారు. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది.













