కర్ణాటక సీఎంకు రెండోసారి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు రోజులు నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరానని, ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. అయితే స్వల్పంగా జ్వరం తప్ప తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన చికిత్స నిమిత్తం స్థానిక మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఇటీవల తనను కలిసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
యడియూరప్పకు కరోనా సోకడం ఎనిమిది నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఆగస్టు 2న ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మణిపాల్ ఆసుపత్రిలో తొమ్మిది రోజుల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే ఆయన వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చేరడానికి కొద్ది గంటల ముందే సీఎం తన నివాసంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు.













