‘రూ.1823 కోట్లు కట్టండి’.. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ షాకిచ్చిన ఐటీ శాఖ
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పన్ను ఎగవేత కేసులో కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన ఆదాయపు పన్ను శాఖ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులో 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్లు చేయించాలని సూచించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఐటీ శాఖ ఈ నోటీసులు జారీచేయడాన్ని కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.
“ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకే కేంద్రం ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు దిగుతోంది. దీన్ని మేము చట్టపరంగా సవాల్ చేస్తాం” అని పేర్కొన్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను శాఖ పంపిన తాజా నోటీసుపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన స్పందనను తెలిపారు. “ప్రభుత్వం మారినప్పుడు, ‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం’ చేసే వారిపై చర్యలు తీసుకుంటారు. మరియు అలాంటి చర్య మళ్లీ ఎవరూ చేయడానికి సాహసించరు. ఇది నా హామీ” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.













