కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ.. మాజీ సీఎం సహా
గోవాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో వారంతా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో వారు స్పీకర్ను కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతున్నారంటూ తర్వాత గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవడే మీడియాకు తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ కుండువా కప్పుకున్నారు.
గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది బీజేపీలో చేరారు. వీరిలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్ లోబో వంటి సీనియర్ నేతలున్నారు. మూడిరట రెండొంతుల మంది పార్టీని వీడడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది.













