చార్‍ధామ్ యాత్రపై… ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చార్‍ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం ఆ నాలుగు ఆలయాల్లో ఉండే పూజారులు మాత్రమే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. మే 14 నుంచి ఈ యాత్రం ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా సమయంలో కుంభమేళాను కొనసాగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశమై చార్‍ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్‍లోని బద్రీనాథ్, కేదార్‍నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‍ధామ్‍లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ సారి యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది.